ఏమిటో, మనవాళ్ళకి రోజుకో గొడవుంటేనే కానీ, తోచదు. క్రికెట్ లో అవేవో One Day International లాగ, ఒకరోజు “దీక్ష”, “మూడు గంటలు ఉపోషం “ టివీల్లో చర్చలూ అయితే పరవాలేదు కానీ, మరీ ప్రాణాలు తీసికోవడం ఎందుకో అర్ధం అవదు. పోనీ అదేదో “ ప్రత్యేక హోదా “ అనేది వచ్చేస్తే, రాష్ట్రం ఏదైనా రాత్రికి రాత్రి బాగుపడిపోతుందా? మహా అయితే, రాజకీయ నాయకుల జేబులు ఇంకొంచెం నిండుతాయి. ఈమాత్రం దానికి, పాపం ఆయనెవరో ఆత్మాహుతి చేసికున్నారుట. వెంకయ్యనాయుడి దగ్గరనుండి, తెలుగువారిని నట్టేట ముంచిన కాంగ్రెస్ వాళ్ళదాకా, ప్రతీవాడూ, “ విచారం వ్యక్త “ పరిచేవాడే. కొన్ని రోజులక్రితం ఈ విషయం మీద ఒక టపా వ్రాశాను. అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మార్పులేదు. మార్పు వస్తుందని ఆశించడం కూడా, బుధ్ధితక్కువ. ఈ విషయం రాజకీయనాయకులకీ తెలుసు. కానీ, ఏదో ఒక కాలక్షేపం ఉండాలిగా, అసలంటూ పార్లమెంటు సమావేశాలు జరుగుతే, ఓ పార్టీవాడు, ఓ ప్రసంగం చేస్తాడు, మిగిలినవాళ్ళు, నల్ల బ్యాడ్జీలూ, అట్టముక్కలూ పట్టుకుని , ఓసారి ప్రత్యక్షప్రసారాల ద్వారా మన కళ్ళకి విందుచేస్తారు. ఈమాత్రం దానికి ప్రాణాలు తీసికునేటంత అవసరం ఏం వచ్చిందో?
అసలు ప్రత్యేకంగా మళ్ళీ ఈ “ ప్రత్యేక హోదా “ ఏమిటో? అసలు మన తెలుగువారిలో ఉన్న ప్రత్యేకత, ఇంకో భాషవారికున్నట్టు చూపించండి. ఎక్కడ చూసినా “ప్రత్యేకతే “. ఉదాహరణకి….
1) ఒకడు చెప్పింది ఇంకోడు వినడు. ఎవడికివాడే తనంత గొప్పవాడు లేడంటాడు.
2) ప్రత్యేక హోదా వచ్చిన మన తెలుగు బాషలో మాట్టాడేదెంతమందుంటారు? పైగా, అవతలివాడు తెలుగువాడైతే, వాడిని తెలుగువాడిలా గుర్తించడం, మన యువతరానికి < నామోషీ—అదేదో “ గుల్టీ “ అంటారు.స్కూళ్ళలో మాతృభాషలో మాట్టాడితే చివాట్లూ, చెప్పుదెబ్బలూనూ. ఇది మన వారికే ప్రత్యేకత.
3) మన తెలుగువారిలో ఉన్నంతమంది జ్యోతిష్కులు ఇంకే భాషలోనూ ఉంటారనుకోను. అదేమి చిత్రమో, ఓ చానెల్ లో చెప్పిన వారఫలానికి, ఇంకో చానెల్ లో చెప్పినదానికీ పోలికే ఉండదు. ఒకాయన “ మిశ్రమ ఫలితాలు” అంటారు, ఇంకో ఆయన , అసలు ఈ వారమంతా పట్టిందంతా బంగారం “ అంటాడు..
4) ఇంక ప్రవచనకారుల విషయానికొస్తే, ఇంకోరెవరికో ప్రసారమాధ్యమాలద్వారా పరపతి పెరిగిపోతుందనే దుగ్ధ తో అవాకులూ చవాకులూ మాట్టాడ్డం. ఏ ఒక్క ప్రత్యేక సందర్భం వచ్చినా, దానికి, ఒకరితో ఒకరు ఏకీభవించకపోవడం. ఉదాహరణకి, ఈ మధ్య జరిగిన గోదావరి పుష్కరాలు—ఒకరేమో జూలై 7 , అన్నారు, పైగా గోదాట్లో ఆరోజున స్నానాలూ, పిండప్రదానాలూ చేసేసి ఫొటోలూ అవీనూ. ఇంకో ఆయన జూలై 12 అన్నారు. ఠాఠ్ మేం చెప్పిందే రైటూ అనేసి, నాయుడుగారేమో, స్నానాలూ గట్రా చేసేసి, ఓ ముఫై మంది ని బలిచేసేసి ( అని కొంతమంది ఉవాచ.. ఇంకా విచారణ కమెటీ పెట్టలేదు ), ఆ పన్నెండురోజులూ, రాజమండ్రీలోనే మకాం పెట్టి, చిట్టచివరగా ఊరు పేరే మార్చేశారు.
5) దేశవిదేశాల్లో, ఏ రంగంలోఅయినా ఘనత సాధించగానే, ఆయన పుట్టుపూర్వోత్తరాలు కూపీ లాగేసి, కర్మకాలి వారిపేరులో “ తెలుగు వాసన “ కనిపించిందా, వెంటనే “ మనవాడేనోయ్ “ అనేసి చంకలు చరిచేసికోడం. ప్రతిభాపాటవాలున్న తెలుగువారిని గుర్తించకపోవడమే అసలు మనకే స్వంతమైన “ ప్రత్యేకత”. ఉదాహరణకి , శ్రీ బాపుగారు, ఆయనకి ప్రభుత్వ బిరుదు, పక్క రాష్ట్రం ద్వారా రావడం. పాపం శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారికైతే అసలు ఇవ్వనే లేదు.
6) ఇంకో చిత్రమేమిటంటే, ప్రతీ ఏటా ప్రభుత్వం ప్రకటించే పద్మ ఎవార్డులని, అదేదో బిరుదులా పేరుకి ముందర తగిలించుకోడం. అదే కాకుండా, అసలు మాకు ఫలానాదే ఇవ్వాలీ అని అడుక్కోడం.
7) ప్రసార మాధ్యమాల ద్వారా celebreties అయిన ప్రతీవాడూ, ప్రపంచంలో తనంత గొప్పవాడే లేనట్టు ప్రవర్తించడం.
8) తెలుగు సాహిత్యం చదవడమే మహాపాపం అనుకుని, ఏ ఇద్దరు తెలుగువారు కలిసినా, అప్పుడే మార్కెట్ లోకి వచ్చిన ఇంగ్లీషు పుస్తకం గురించి చర్చించుకోడం. పైగా, వాటిని చదవనందుకు, అలాటివారిని చిన్నచూపు చూడడం.
9) ఇంకో “ప్రత్యేకత” ఏమిటంటే, తెలుగులో వచ్చే వార మాస పత్రికల్లో, తెలుగు నటులకంటే, హిందీ చిత్రనటులగురించే రాయడం. , జాతీయ Magazines లో అసలు మనవాళ్ళనే గుర్తించరన్న విషయం మర్చిపోయి.
10) అన్నిటిలోకీ ముఖ్యమైనది—మన ప్రజా ప్రతినిధులు, మన అదృష్టం బాగోక, ఏ ఇంగ్లీషు చానెల్ లోనో చర్చాకార్యక్రమాలకి వెళ్ళినప్పుడు, అవాకులూ, చవాకులూ పేలడం. ఉదాహరణకి అప్పుడెప్పుడో, ఓ పార్లమెంటు సభ్యుడు (పైగా మా అమలాపురం వాడేట, చెప్పుకోడానికే సిగ్గుగా ఉంది ) మన సైనిక దళాలగురించి నోటికొచ్చినట్టు మాట్టాడి, తెలుగువారందరి తలా దించుకునేటట్టు చేశాడు. అయినా అలాటివాటిని పట్టించుకోకపోవడం, మన రాష్ట్ర నాయకులకే చెల్లింది.
ఇలా రాసుకుంటూ పోతే, మన రాష్ట్రానికి ఉన్న “ ప్రత్యేకతల “ చిఠ్ఠా, కొల్లేరు చాంతాడంత అవుతుంది. ఇంకా “Special Status “ లూ, సింగినాదాలూ ఎందుకండి బాబూ ?
సర్వే జనా సుఖినోభవంతూ…
.
