ఏదో నెత్తిమీదకి ఏళ్ళొచ్చాయికదా అని ప్రతీదీ మనకే తెలుసుననుకోకూడదు… చిన్నప్పుడు నాన్న చెయ్యిపట్టుకుంటే ఆయన ఎక్కడకి తీసికెళ్తే అక్కడికే వెళ్ళడం. ఉద్యోగంలో చేరాక, ఆరోజుల్లో, ఏవో ” ఉడుపి హొటళ్ళు ” తప్ప ఇంకేమీ ఉండేవికావు.. ఉండేవేమో ఎవడికి తెలుసూ, వచ్చే నాలుగురాళ్ళకీ ఈ పెద్ద హొటల్స్ కూడా ఎందుకూ?.. పెళ్ళైన తరవాత, ఆ వెర్రి ఇల్లాలు, నాకన్నీ తెలుసుననే భ్రమలో ఉండేది.. మహా వెళ్తే ఏ ఆదివారప్పూటో సినిమాకి వెళ్ళడం. పైగా ఆరోజుల్లో శనాదివారాలు రాత్రి భోజనం మానేసి ఫలహారం ( దీన్నే జరుగుబాటు రోగం అంటారు ).. పక్కనే ఉండే ఏ ఉడిపీ హొటల్లోనో ఇడ్లీ సాంబార్, కావల్సొస్తే రెండేసి ప్లేట్లు లాగించేసి కొంపకి చేరడం.
అఛ్ఛా.. అప్పుడెప్పుడో ఓ సినిమా వచ్చింది.. అందులో హీరోయో, హీరోయిన్ దో డబుల్ రోల్– ఒకరు చలాకీ , రెండొవారు అమాయకమూనూ.. స్థానాలు మార్చుకుంటారు.. అమాయకపు ప్రాణిని ఇంట్లోవాళ్ళు యాతనపెడితూంటే , కొత్తగావచ్చిన మనిషి, పరిస్థితిని చక్కపెట్టాలని, నిశ్చయించుకుంటుంది. ఆస్థి అంతా ఈపిల్లపేరునే ఉంటుంది. ఏదో చెక్ సంతకం పెట్టాల్సినప్పుడు, చేతికో కట్టుకట్టుకుని మొత్తానికి తప్పించుకుంటుంది…
నిన్నటి రోజున మా శివ జాస్థి గారు, మా ఇంటికి వచ్చారు. ఇంట్లో ఎందుకూ, డిన్నర్ బయటే తిందామన్నారు.. సరే మరి, తప్పుతుందా.. నాకేమో ఈ పెద్దపెద్దహొటల్స్ లో ఆర్డరు ఎలా ఇవ్వాలో తెలియదాయే.. ఉడిపీ హోటళ్ళ స్థాయే నాది… పిల్లలతో పెద్ద హొటళ్ళకి వెళ్ళినా, వాళ్ళే ఆర్డర్ చేయడంతో నేనెప్పుడూ వీధిన పడలేదు… ఇవేళ బాధ్యతంతా నామీద పెట్టేసింది మా ఇంటావిడ.. పైగా ఆ మెనూ చూసి మనక్కావాల్సినవి ఆర్డర్ చేయాలిట.. నాకేమో ఆ పేర్లు తెలియవు.. అప్పుడెప్పుడో ఓ Five Star Hotel లో అదేదో బఫేట.. అక్కదపేర్చున్నవన్నీ నాకళ్ళకి ఒకేలా కనిపించాయి.. ఏదో చూడ్డానికి బావుందికదా అని తీసుకోబోతూంటే, మా మనవడు, ” తాతయ్యా నువ్వు Non Veg ఎప్పుడు మొదలెట్టావూ.. ” అన్నాడు. ఓరినాయనోయ్ అది Non veg అని నీకెలా తెలుసురా అంటే, అక్కడేదో Red Dot ఉందిగా అన్నాడు. అప్పుడుతెలిసింది, ఆ Red Dot కీ, Green dot కీతేడా.. This is my only brush with Buffet in a Big Hotel. మళ్ళీ , ఎవరో ఒకరు తోడులేకుండా మళ్ళీ ఆ బఫేల మొహం చూడలేదు. ఇప్పుడు నాలాటివాడికి అదేదో A la carte Dinner ఆర్డరు చేయాలంటే జరిగే పనేనా? భగవంతుణ్ణి ప్రార్ధిస్తే ఏదో మార్గం చూపిస్తాడే.. అదేం అదృష్టమో నిన్నటి రోజున, నాకు రొంపా, జలుబూ, దగ్గూ వచ్చేసి, గొంతుక కాస్తా Mute అయిపోయింది… నోరువిప్పితే మాట కి బదులుగా ఓన్లీ హవా మాత్రమే.. అమ్మయ్యా బతికిపోయానురా అనుకుని, శివ గారినీ, మా ఇంటావిణ్ణీ ఆర్డరు చేసేయమన్నాను.. ఆ డిన్నర్ పూర్తిచేసి ఇంటికొచ్చాము.
ఇంక వాళ్ళిద్దరూ deep discussions లో పడిపోయారు. వాళ్ళు మాట్టాడుకునే విషయం, నా మట్టిబుర్రలో పడదాయె.. ఆ సాహిత్యం పజిల్సూ అవీనూ.. నా IQ levels బహుతక్కువ. మధ్యలో నన్నేదైనా అడుగుతారేమో అని భయం. అలాగని అక్కడ కూర్చోకుండా ఉన్నా బాగోదూ.. అంత అభిమానంతో వచ్చిన అతిథిని చిన్నబుచ్చినట్టుండదూ? మళ్ళీ, నేనూ, నా మూగబోయిన గొంతుకా నా rescue కి వచ్చెసాయి.. అయినా ఏదో నాకు నేననుకోడమేకానీ , వాళ్ళకీ తెలుసు నా role ఆటలో సత్రకాయ లాటిదని .
అలా మొత్తానికి హొటల్లోకానీ, వీళ్ళ సాహిత్యచర్చలో కానీ, నాకున్న పరిమిత జ్ఞానం బయట పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా బయటపడ్డాను.