రాత్రి డిన్నర్ అయిన తరువాత చల్లగా, చెప్పారు, మర్నాడు ఉదయం 630 కల్లా, మళ్ళీ ఆ ఆడవిలోకి వెళ్తున్నామని. ఈసారి ఇంకో Zone, మేముండే DEV VILAS కి దగ్గరలోనే.. నాకు అక్కడ నచ్చిన మరో విషయం ఏమిటంటే, రాత్రి పడుక్కోబోయే ముండు, రెండు Hot water bags తెచ్చి, మా కంబళి/ రగ్గు లకింద పెట్టడం. రూమ్మంతా వెచ్చవెచ్చగానే ఉందనుకోండి, కానీ ఈ arrangement ఇంకా బావుంది. అంత వెచ్చగా పడుక్కుని, మర్నాడు ఏదో చిన్నప్పుడు పరీక్షల్లో లేచినట్టు, మరీ తెల్లారకట్ల లేవమంటే కష్టమే కదూ.. మధ్యలో మా అగస్త్య reminder ఒకటీ.. సుభే సుభే తయ్యార్ హోకే రెహనా అంటూ..ఎంతైనా మనవడిదగ్గర పరువుంచుకోవద్దూ? మొత్తానికి ఆ జిప్సీ ఏదో వచ్చేసరికి, ఒంటినిండా all available స్వెట్టర్లూ, జాకెట్టూ వేసేసికుని , నెత్తికో మఫ్లర్ కూడా చుట్టుకుని, గంగిరెద్దుకి అలంకరణ చేస్తారే, అలాగ నన్ను మా ఇంటావిడ నన్ను అలంకరించగా చాయ్ తాగేసి రెడీ అయ్యాను.
అన్నీ చెప్పి ముఖ్యమైన విషయం చెప్పడమే మర్చిపోయాను– జైపూర్ లో లాగ కాకుండా, ఇక్కడ ఈ Resort లో రెండు భయంకరమైన కుక్కలు, పైగా నాకంటే పొడుగ్గా ఉన్నాయి, వాటిని free గా వదిలేసారు… అక్కడున్న 3 రోజులూ భయమే నాకు.. ఎలాగొలాగ వాటి బారిన పడకుండా లాగించేసాను మొత్తానికి… 630 కల్లా ఆ దగ్గరలోఉన్న Zone కి చేరాము. మా గైడ్ అయితే చెప్పాడు, ఆ ముందురోజు ఓ పులి కనిపించిందని, మధ్యమధ్యలో కిందకి చూడ్డం, అవిగో పగ్ మార్కులు.. ఇవిగో పగ్ మార్కులూ.. పులి ఇక్కడే ఎక్కడో తిరుగుతోంది.. అంటూ, అడవంతా తిప్పాడు. అడవి జంతువులు తప్పించి, పులి మాత్రం కనిపించలేదు.

