మన రాష్ట్రాల్లో వివాహిత స్త్రీలు రకరకాల నోములు చేసుకుంటూంటారు ..గుర్తుండే ఉంటుంది… నోముల మాటెలా ఉన్నా, ఆ వ్రత/ నోముకి “ ఉద్యాపన” చాలా ముఖ్యంట. ఫలానా టైముకే చేసుకోవాలని లేదు.. ఎప్పటికో అప్పటికి చేసుకోవడం ముఖ్యం.. అందుకే చూస్తూంటాం.. పెళ్ళిళ్ళలో , ఎవరో ఒకరు, వారు చేసుకున్న నోములకి ఉద్యాపన చేసేసుకుంటూంటారు..
అలాగే ప్రస్తుతం జరుగుతున్న “వాక్సినేషన్” కి, రెండో “ డోస్ “ వేసుకోవడం, ఆ నోముల ఉద్యాపన లాటిదే.. కానీ వచ్చిన గొడవేమిటంటే, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటామంటే కుదిరే పని కాదు.. ప్రస్తుతం వాడకంలో ఉన్న రెండు వాక్సీన్లకీ , 4 వారాల్లో ( 28 రోజుల్లో) , రెండో డోసు తప్పకుండా తీసుకోవాలన్నారు.. పైగా, March 1 కి ముందర తీసుకున్నవారందరూ అంటే, డాక్టర్లూ వగైరా తీసుకున్నారు కూడానూ..మార్చ్ 1 తరవాత సీనియర్ సిటిజెన్లకి మొదలెట్టారు.. ఏదో కిందా మీదా పడి, మొదటి డోసు, ఎవరికి అందుబాటులో ఉన్నది, తీసుకుని, ఫొటోలు కూడా పెట్టి నానా హడావిడీ చేసారు.. నోము/ వ్రతం అయితే చేసుకున్నారు, కానీ ఉద్యాపన మాటేమిటి.. అకస్మాత్తుగా ఇక్కడ కథకి ఓ ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం.. కోవాక్సీన్ తీసుకున్నవారికి, 28 రోజుల్లో రెండో డోసు కూడా ఇచ్చేట్టూ, కానీ ఆ రెండోదుందే కోవీషీల్డ్ కి మాత్రం, కనీసం 40+ రోజులైనా పూర్తవాలి, అప్పుడే ప్రభావం ఎక్కువగా ఉంటుందీ అన్నారు.. ఇదీ కథ..
మేము 6 మార్చ్ న మొదటి డోసు తీసుకున్నాము.. మొదట్లో చెప్పినట్టుగా, 28 రోజుల తరవాత, అదే హాస్పిటల్ లో slot book చేసుకుని, ఫోన్ చేస్తే, రావొద్దుపొమ్మన్నారు.. 40+ రోజుల తరవాతకే reschedule చేసుకోమన్నారు. శుభం..కానీ సడెన్ గా vaccine shortage మొదలయింది.. ఓవైపున కేసులు విపరీతంగా పెరుగుతూండడంతో, 45+ వయసువారికి కూడా మొదలెట్టడంతో, ఓ రకంగా rush ఎక్కువవడంతో, వాక్సీన్లు లేక, చాలా సెంటర్లు మూసేసారు.. నానా గందరగోళం జరిగింది, ఇంకా జరుగుతోంది కూడా.. ఏదో ఆ 40+ రోజులూ పూర్తయాయి కదా అని, ఉన్న సెంటర్లలో బుక్ చేసుకోవడం, తీరా వెళ్దామనుకునేటప్పటికి, వాళ్ళ దగ్గరనుండి s m s .. your scheduled vaccination is cancelled.. please reschedule.. inconvenience caused is regretted.. అంటూ..కనీసం 3 సార్లు జరగ్గా జరగ్గా… నిన్న మా అబ్బాయి మరో హాస్పిటల్ లింక్ పంపాడు.. వాళ్ళకి ఫోనుచేస్తే, ఇవేళ 1030 కి ఆధార్ కార్డ్ తీసుకుని డైరెక్ట్ గా వచ్చేయమన్నారు.. విషయం అబ్బాయికి చెప్పగానే, కార్ పంపాడు.. కొత్త మాస్క్ లు కూడా పంపించాడు.. అక్కడకి వెళ్ళేసరికి అప్పటికి ఓ అయిదుగురుండగా, మాకు 06, 07 టోకెన్లు ఇచ్చారు..ఇంతలో ఓ డాక్టరు గారొచ్చి, ఉన్నవి 10 డోసులు మాత్రమే, 10 లోపు నెంబర్లవారు మాత్రమే ఉండి, మిగిలినవారిని పంపేసారు.. మొత్తానికి, మా నెంబర్ రావడం, 500/- కట్టి రెండో డోసు తీసుకుని, ఓ అరగంట అక్కడే wait చేసి, ఇంటికి చేరుకోవడమూ జరిగింది.
అవ్విధంగా మా “కోవిషీల్డ్ వాక్సీన్ నోము” కి ఉద్యాపన కూడా విజయవంతంగా పూర్తిచేసుకున్నాము.. ప్రస్తుతం వరకూ ఎటువంటి side effects కనిపించలేదు..
May 1 వ తారీకునుండి, 18+ వయసువారందరూ వాక్సినేషన్లకి ‘అర్హులు’ అంటున్నారు..పరిస్థితి మెరుగుపడుతుందో, లేక జనాలెక్కువయి మరింత గందరగోళంగా ఉంటుందో, ఆ పైవాడికే తెలియాలి..
బైదవే వాక్సినేషన్ ఫైనల్ సర్టిఫికేట్ కూడా download అయింది….