గత కొన్ని నెలలుగా టివీలో వార్తలు చూడడమూ, వార్తాపత్రికలలో రాజకీయ వార్తలు చదవడమూ మానేశాను . చూసి చూసి అసహ్యించుకునే కంటే హాయిగా మానేయడమే సుఖంకదా. మరీ టివీ ని అటకపై పెట్టేస్తే, మిగిలిన కొన్ని కార్యక్రమాలు మిస్సవుతాము. ఏదో “చెరువు మీద కోపమొస్తే..” అన్న సామెతలోలాగ, రాజకీయాలంటే అసహ్యమైతే వాటిగురించి పట్టించుకోవడం మానేయడం ఉత్తమం కదా? ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వాలు ఏర్పడేదాకా మాత్రమే ఈ నియమం. ఆ తరువాత చూద్దాం…
టీవీ లో ఈ వారం కొన్ని అపురూప దృశ్యాలు చూసే అదృష్టం కలిగింది. అసలు నోరు విప్పితేనే ముత్యాలు రాలిపోతాయా అనుకునే నా అభిమాన దైవం శ్రీ బాపు గారు SVBC లో ఇంటర్వ్యూ ఇవ్వడం. మొన్న 4 న మొదటిభాగం పెట్టారు.రెండో భాగం 11 వ తారీకున చూపిస్తారుట. ఇంటర్వ్యూలో ఎంతసేపూ రమణ గారి గురించీ, తమ సినిమాలకి కెమెరామాన్ రవికాంత్ గారి గురించే కానీ, తన గురించి ఒక్క మాటైనా చెప్పుకోకపోవడం శ్రీ బాపు గారికే చెల్లిందనుకుంటాను. ఆ ఇంటర్వ్యూ విడియో ఇంకా నెట్ లో పెట్టలేదు.
ఇంక రెండో అపురూప దృశ్యం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనం. ఎప్పుడు చూసినా, విన్నా అనర్గళంగా ప్రసంగం చేసే శ్రీ కోటేశ్వరరావుగారు ఒక పుస్తకంలో చూసి ప్రవచనం చేయడం. అలాటి rarest of rare సందర్భాలు కూడా చూడొచ్చని ఇప్పుడు తెలిసింది. ప్రేక్షకులని చూస్తూ ధారాపాతంగా ప్రసంగం చేస్తూ, ఎక్కడెక్కడివో శ్లోకాలు అరటిపండు ఒలిచి చేతిలోపెట్టినంత సులభంగా ప్రవచనం చేసే శ్రీ చాగంటి వారు, ఓ పుస్తకంలో చూసి/చదివి ప్రసంగం చేయడం అపురూపంకాక మరేవిటంటారు? ఆ ప్రవచనం లింకు ఇక్కడ చూడండి.
నిన్న పేపర్లో ఒక వార్త చదివాను- కేంద్రప్రభుత్వ పెన్షనర్లు ఇన్నాళ్ళూ CGHS స్కీం లో ఏదో అవసరం వచ్చినప్పుడు ఏదో హాస్పిటల్ కి వెళ్ళి cashless వైద్యం చేసేసికోవడం చూస్తూంటాం. రేపటినుండీ ( 07-03-2014) ఈ సదుపాయం కాస్తా తీసేశారుట.వైద్యం చేయించుకుని మనమే డబ్బులు కట్టేసి, తరువాత claim పెట్టుకోవాలిట ! CGHS Smart Cards ఇవ్వడానికే టైములేదాయె వారికి, అలాటిది వైద్యం చేయించుకుని claims పూర్తిచేయడానికి ఎన్నేళ్ళు పడుతుందో మరి? రిటైరయినవాళ్ళ దగ్గర వైద్యానికి అయ్యే లక్షలకొద్దీ డబ్బులు ఎలా ఉంటాయో ఆ పరమేశ్వరుడికే తెలియాలి. వీళ్ళేమైనా రాజకీయనాయకులా ఏమిటీ? అదృష్టంకొద్దీ ఇప్పటిదాకా CGHS ద్వారా వైద్యం చేయించుకోవాల్సిన అగత్యం కలుగలేదు. ఆ భగవంతుని దయతో ఇటుపైన కూడా అలాటి అవసరం రాకూడదనే ప్రార్ధిస్తున్నాను. అయినా మన చేతిలో ఏముందిలెండి. చూద్దాం…
